లండన్‌లో వైభవంగా జరిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు
London (UK): 18 మే 2024న, గ్రేటర్ లండన్‌లోని సట్టన్ పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 34 ఆర్య వైశ్య కుటుంబాలు సామూహిక పూజలో పాల్గొని, భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి అమ్మవారిని కొలుచుకున్నారు.
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవత. శక్తి స్వరూపిణి అయిన వాసవి అమ్మవారు శక్తి, ఆరోగ్యం, సంపదకు ప్రతిరూపంగా భక్తులు కొలుస్తారు.
సాంప్రదాయ రీతిలో అలంకరించిన వేదికపై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి గణేశ పూజ, వాసవి అభిషేకం, అధాంగ పూజ, షోడశోపచార పూజ, అష్టోత్తర పూజ, కుంకుమ పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లలు వాసవి కథను చదివి వినిపించగా, మహిళలు వాసవి పారాయణం, చాలీసా పఠించారు. భక్తులు భజనలు, కీర్తనలు ఆలపించి, అమ్మవారి కృపను కోరారు. వేడుకల అనంతరం మహా ప్రసాద వితరణ చేశారు.
కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ, “ఈ సంవత్సరం సట్టన్‌లో మొదటిసారిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము. 34 ఆర్య వైశ్య కుటుంబాలు సామూహిక పూజలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ వేడుకల ద్వారా మన పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించడానికి ఒక మంచి అవకాశం లభించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు” అని అన్నారు. వచ్చే సంవత్సరంలో కూడా ఇలాంటి ఘనమైన వేడుకలను జరుపుకోవాలని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేసిన నిర్వాహక కమిటీ మరియు ఇతర సభ్యులను అందరూ అభినందించారు.
